A l l L i v e T e l u g u C h a n n e l s
Home » , » ప్రయోగాల వేళ ( ' గోపాల గోపాల ' రివ్యూ)

ప్రయోగాల వేళ ( ' గోపాల గోపాల ' రివ్యూ)

{[['']]}

Rating:2.5/5

"నేను టైమ్ కు రావటం కాదు మిత్రమా...నేను వచ్చాకే టైమ్ వస్తుంది " అంటూ ఎదురుచూస్తున్న పవన్కళ్యాణ్ కృష్ణుడుగా వచ్చేసాడు. అయితే ఈ సారి ఓ ప్రయోగం లాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రంతో వచ్చారు.తన పాత్రకు రెగ్యులర్ మసాలా దినుసులు(హీరోయిన్స్, రొమాన్స్,పాటలు,ఫైట్స్) లేకపోయినా బాగుందనిపించారు.ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలు కొన్ని ఆలోచనలో పడేసే దిసగాప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్, తో నింపటం జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లుకూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఓ ప్రయోగంగా చూస్తే బాగుందనిపించే ఈ చిత్రం కమర్షియల్ గా భాక్సాఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. అవన్నీ ప్రక్కన పెడితే పవన్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో... వాటిని ప్రక్కన పెట్టి మెసేజ్ తో కూడిన ఇలాంటి చిత్రంతో ముందుకు రావటం మాత్రం అభినందనీయం.

కథ:

గోపాల (విక్టరీ వెంకటేష్) వివిధ రకాల దేవుడి ప్రతిమలను విక్రయించుకునే చిరు వ్యాపారి. అతని షాపుకు ఒక సాధువు వస్తారు. ఆ సాధువుతో గోపాల చిన్నపాటి గొడవ పడతాడు. దీంతో ఆగ్రహించిన ఆ సాధువు.. గోపాలను శపిస్తాడు. అలా శపించిన మరుసటి రోజే భూకంపం వచ్చి కేవలం గోపాల షాపు మాత్రమే ధ్వంసమై పోతుంది. దీంతో ఇతర వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గోపాలను ఓదార్చుతారు.

అయితే, గోపాల మాత్రం ఆ సాధువు శాపం వల్లే ఇలా జరిగిందని వారికి వివరిస్తారు. అదేసమయంలో షాపునకు ఉన్న రూ. కోటి బీమాను క్లైమ్ చేసుకునేందుకు బీమా కార్యాలయానికి వెళతారు. ఇది దేవుడి శాపం వల్ల జరిగిన ప్రమాదమని అందువల్ల నష్టపరిహారం చెల్లించలేమని బీమా కంపెనీవారు సమాధానం ఇవ్వడమే కాకుండా, దేవుడిపై కేసు పెట్టుకోమని సలహా ఇస్తారు.

దీంతో గోపాల దేవుడిపై కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని మత పెద్దలు, సాధువులకు నోటీసులు జారీ చేసి కోర్టుకు రావాలని పేర్కొంటారు. దీంతో సాధువులు, మతపెద్ద (మిథున్ చక్రవర్తి), మతపెద్దలు కోర్టుకు వస్తారు. అపుడు తమను గోపాల కోర్టుకు పిలిపించి అవమానించారంటూ అతనిపై దాడి చేస్తారు. ఈ గోపాలను రక్షించేందుకు దేవుడు (పవన్ కళ్యాణ్) భూమికి దిగివస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

మనకి దేముడే దిగివస్తే తరహా కథలు కొత్తేమి కాదు. అయితే ఇందులో బ్యూటీ అంతా... దేముడు మీద కేసు వేయటం అనే అంశం. ఈ ఐడియా చుట్టూ అల్లిన ఈ కథ కు తెలుగులో మరింత అర్దమయ్యేలా(అర్దవంతంగా కాదు) ట్రీట్ మెంట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. వాస్తవానికి 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా 'ఓ మై గాడ్‌'. తెరకెక్కింది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించింది.

పూర్తి డ్రామాతో నడిచే ఈ రెండు చిత్రాలుకు స్టార్ వ్యాల్యూ కన్నా కాన్సెప్ట్ బలంగా వెళ్లి ప్రేక్షకులను థియోటర్ వైపు నడిపించాయి. అయితే తెలుగులో మొదటి నుంచి ఇది పవన్ కళ్యాణ్ చిత్రం, మల్టి స్టారర్ చిత్రం అంటూ ప్రచారం చేసారు. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రం కదా అని ఎక్కువ అంచనాలు ఏర్పడి,బిజినెస్ బాగా జరిగినా లోపలకి వెళ్లి చూస్తే పవన్ కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే....అదీ ఏమీ చేసినట్లు ఉండదు.

 మొత్తం వెంకటేష్ చుట్టూ తిరుగుతూంటుంది. ఫస్టాఫ్ కేసు వేయటం, పవన్ రావటం దాకా బాగున్న ఈ చిత్రం కథనం, సెకండాఫ్ లో డ్రాగ్ అవుతూ వస్తుంది. సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అలాగే నెగిటివ్ పాత్ర సైతం ఎస్టాబ్లిష్ సరిగ్గా కాకపోవటం(కేవలం ఫైట్స్ కోసం...అదీ పవన్ సేవ్ చేయటం కోసమే పెట్టినట్లున్నాయి) జరిగింది.ఈ కథ అంతిమ లక్ష్యం...వెంకటేష్ పాత్ర కేసు నెగ్గటమా లేక అతను నాస్తికత్వం వదలి దేముడు ఉన్నాడని అర్దం చేసుకోవటమా అనేది మరింత క్లారిటిగా చెప్తే బాగుండేది.

ఏది ఎలా ఉన్నా... మూఢ నమ్మకాలు, దొంగ స్వాములుపై వ్యంగ్య బాణంలాంటి ఇలాంటి ఆలోచనాత్మక చిత్రాలు తెలుగులో రావాల్సిన సమయం వచ్చింది. అందుకు పవన్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు తమ ఇమేజ్ లు వదిలి ముందుకు రావటం శుభపరిణామం. పవన్ ఉన్నాడని ఆయన రెగ్యులర్ చిత్రం లాగ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి.Share this article :

Post a Comment

 
Copyright © 2011. TeluguFilmsPortal - All Rights Reserved